తెలంగాణ వీణ , క్రీడలు : భారత అథ్లెట్ స్వప్నా బర్మన్ తోటి క్రీడాకారిణి అగసార నందినిపై విషం చిమ్మింది. ఆసియా క్రీడలు-2023లో ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తెలంగాణ అమ్మాయి నందినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నందినిని ట్రాన్స్‌జెండర్‌గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన స్వప్నా వెంటనే దానిని డిలీట్ చేసింది.ఈ నేపథ్యంలో స్వప్నా తీరుపై భారత క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ప్లేయర్‌పై విద్వేషపూరిత కామెంట్లు చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. కాగా చైనా వేదికగా హోంగ్జూలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో నందిని కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.రెండు రోజుల పాటు జరిగిన ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో 5712 పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా బ్రాంజ్ మెడల్ సాధించి ఆసియా క్రీడల్లో సత్తా చాటింది.అయితే, ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో వెనుదిరగింది. గత ఎడిషన్‌లో పసిడి పతకం సాధించిన స్వప్నా ఈసారి ఘోర ఓటమి నేపథ్యంలో నందిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది.