తెలంగాణ వీణ , జాతీయం :రాష్ట్రంలో మైనార్టీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకొనేందుకు సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని ‘లింగ్విస్టిక్ మైనార్టీస్ ఫోరం ఆఫ్ తమిళనాడు’ (లిమ్‌ఫోర్ట్) చైర్మన్ ఆచార్య సీఎంకే రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ వంటి మైనార్టీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకోవచ్చని సుప్రీంకోర్టు గత నెల 21వ తేది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చెన్నై ప్రెస్‌క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిమ్‌ఫోర్ట్ చైర్మన్ సీఎంకే రెడ్డి, వైస్ చైర్మన్లు నందగోవింద్ (మలయాళం), పి.నారాయణ భట్ (కన్నడ), ప్రముఖ న్యాయవాది సత్యరాజ్, హెగ్డే, ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ముందుగా సీఎంకే రెడ్డి మాట్లాడుతూ… సుప్రీంకోర్టు లిమ్‌ఫోర్ట్‌కు మద్దతుగా ఇటీవల వెలువరించిన తీర్పును రాష్ట్రప్రభుత్వం త్రికరణశుద్ధిగా అమలు చేయాలని, తద్వారా మైనార్టీ భాషలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 13 మైనార్టీ భాషలు మాట్లాడే ప్రజలు ఓటు హక్కు కలిగి ఉన్నారని, వీరిలో తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళ భాషలు మాట్లాడేవారు అధికమన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వారివారి మాతృభాషలో చదువుకోనివ్వాలని, తాము తమిళ భాషలో ఒక సబ్జెక్ట్ చదువుకొనేందుకు కూడా సిద్ధమేనన్నారు. పాలకులు భాషను, సంస్కృతిని, ఆచారాన్ని కాపాడడమే క్షేత్ర ధర్మమని, వీటికి హాని చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని సీఎంకే రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ నాయకులు కేవీ జనార్దనం, భుజంగరావు, జి.మురళి, కుంకు దశరఽథరావు, బీఎన్ బాలాజి, డాక్టర్ ఎన్.నాగభూషణం పాల్గొన్నారు.