తెలంగాణ వీణ , జాతీయం : కావేరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో, మేట్టూరు డ్యాంకు నీటిరాక తగ్గి, ప్రస్తుతం డ్యాంలో 36.94 అడుగుల నీటినిల్వలు మాత్రమే ఉన్నాయి. డెల్టా సాగుకు విడుదల చేస్తున్న క్రమంలో మరో రెండ్రోజులు మాత్రమే సరిపడా ఉండడంతో రైతులు ఆందోలన చెందుతున్నారు. 120 అడుగుల పూర్తి సామర్థ్యం కలిగిన ఈ డ్యాంకు కావేరి పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు, కర్ణాటక విడుదల చేసే జలాలు ఆధారంగా ఉన్నాయి. ఈ డ్యాంపై ఆధారపడి తాగునీరు, డెల్టా జిల్లాలకు సాగు నీరు అందిస్తున్నారు. సోమవారం ఉదయం డ్యాంకు చేరుతున్న నీరు 3,122 ఘనపుటడుగులుండగా, సాగు కోసం 6,500 ఘనపుటడుగులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 36.31 అడుగులతో 10.26 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మేట్టూరు డ్యాంలో మత్స్యసంపద కాపాడేందుకు, తాగునీటి అవసరాలకు 9.5 టీఎంసీ నీటిని నిల్వ ఉంచాల్సి ఉంది. ఆ ప్రకారం, ప్రస్తుత నీటిమట్టాలు పరిశీలిస్తే, మరో రెండ్రోజులు మాత్రమే సాగు నీరు అందించే అవకాశముంది. అదే సమయంలో డ్యాంపై ఆధారపడి 150 తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. డ్యాంలో నీటిమట్టాలు తగ్గితే తాగునీటి కొరత ఏర్పడే అవకాశముంది. రాష్ట్రానికి అందించాల్సిన కావేరి జలాలను కర్ణాటక విడుదల చేస్తే మాత్రమే, డెల్టా జిల్లాల్లో చివరి దశలో ఉన్న పంటలు కాపాడేందుకు వీలుంటుంది. అందువల్ల కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి, రాష్ట్రానికి అందజేయాల్సిన కావేరి జలాలు పొందేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.