తెలంగాణ వీణ , జాతీయం : రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక ఎగ్మూరు ప్రభుత్వ మ్యూజియం ప్రాంగణంలో సోమవారం ఉదయం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు విచ్చేసిన గవర్నర్ రవితో ముఖ్యమంత్రి స్టాలిన్ కరచాలనం చేశారు. ఆ తర్వాత ఆ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ప్రాంతానికి గవర్నర్‌ను తీసుకెళ్ళారు. తొలుత గవర్నర్ రవి గాంధీ విగ్రహం దిగువ అలంకరించిన ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అటుపిమ్మట ముఖ్యమంత్రి స్టాలిన్ గాంధీ చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం ముగియగానే ప్రత్యేక వేదికపై పాఠశాల విద్యార్థులు నిర్వహించిన భజన కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహాత్మాగాంధీని కీర్తిస్తూ భజనమండలి సభ్యులు, విద్యార్థులు శ్రావ్యంగా పాడిన పాటలను విన్నారు. ఈ వేదికపై ఇరువురూ పక్కపక్క సీట్లలోనే ఆశీనులయ్యారు. కార్యక్రమం ఆద్యంతం గవర్నర్, సీఎం స్నేహపూర్వకంగా మసలుకున్నారు. గవర్నర్ ఏదో సుదీర్ఘంగా వివరిస్తుండగా, సీఎం ఆసక్తిగా ఆలకిస్తూ కనిపించారు. గతంలో వీరిద్దరూ ఎప్పుడు కలిసినా సచివాలయం, రాజ్‌భవన్ అధికారులు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఎవరితో చనువుగా ఉంటే ఏం వస్తుందోనన్నట్లుగా అంటీముట్టనట్లుగానే వ్యవహరించేవారు. అయితే సోమవారం ఈ వాతావరణం భిన్నంగా కనిపించింది. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దురైమురుగన్, పొన్ముడి, ఈవీ వేలు, సామినాథన్, ఆర్.ఎస్. రాజకన్నప్పన్, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, ఎంపీ ఆర్.గిరిరాజన్, ఎమ్మెల్యేలు ఇ.పరంథామన్, డి.వేలు, ఏఎంవీ ప్రభాకరరాజా, జీసీసీ మేయర్ ఆర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహే్‌షకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, తమిళభాషాభివద్ధి సమాచార శాఖ కార్యదర్శి డాక్టర్ ఇరా సెల్వరాజ్, పౌరసంబంధాల శాఖ సంచాలకులు డి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.