తెలంగాణ వీణ , జాతీయం : కేరళలోని ఇడుక్కి జిల్లాలో సైరో-మలబార్ చర్చ్ పాస్టర్ బీజేపీలో చేరగానే ఆయనపై చర్చ్ నిర్వాహకులు వేటు వేశారు. ఇడుక్కి జిల్లా బీజేపీ చీఫ్ కేఎస్ అజి నుంచి పాస్టర్ కురియకోస్ మత్తం ప్రాధమిక సభ్యత్వం స్వీకరించిన కొద్ది గంటలకే ఆయను చర్చి బాధ్యతల నుంచి తప్పించారు. మన్‌కువ చర్చ్ ఫాదర్ కురియకోస్ మత్తంను మత గురువు బాధ్యతల నుంచి తొలగించామని ఇడుక్కి బిషప్ తెలిపారు. కనాన్ చట్టం ప్రకారం చర్చ్ పాస్టర్ ఏ రాజకీయ పార్టీలోనూ చేరకూడదని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనరాదని చర్చ్ ప్రతినిధి తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కురియకోస్‌ను పాస్టర్‌గా తొలగించామని పేర్కొన్నారు. కాగా 74 ఏండ్ల కురియకోస్ మత్తం త్వరలో రిటైర్ కానున్నారని చర్చ్ వర్గాలు తెలిపాయి. మణిపూర్ హింసాకాండపై క్యాథలిక్ చర్చ్ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో కురియకోస్ బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చేరకుండా ఉండేందుకు తనకు ఎలాంటి కారణం కనిపించలేదని చర్చ్ ఫాదర్ పేర్కొన్నారు.