తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవో కొన్ని సీట్లకు కక్కుర్తిపడటం, కాపులను వేధించి, అవినీతిలో కూరుకుపోయిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తలవంపుల పని అని వారు భావిస్తున్నారు. ఎవరైనా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలనుకుంటారని, కానీ జనసేనకు తెలుగుదేశం పార్టీ విదిలించే పదిహేను సీట్లతో ఏమి సాధించగలమని జనసైనికులు అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ పవన్ కోరుతున్నట్లుగా 25 సీట్లు ఇచ్చినా, పవన్ సీఎం ఎట్లా అవుతారని నేతలు ప్రశ్నిస్తున్నారు.ఈ కారణాలతోనే ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన పవన్ వారాహి బహిరంగ సభకు జనసేన కార్యకర్తలు అతి తక్కువగా హాజరయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబుతో పొత్తును అధికశాతం జన సైనికులు వ్యతిరేకిస్తారని, పార్టీకి తీరని నష్టమని జనసేన పార్టీలోని ఓ వర్గం మొదటి నుంచీ చెబుతోంది. ఇప్పుడు అదే నిజమైందని అంటున్నారు.టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత తొలిసారిగా పవన్ వారాహి సభ అవనిగడ్డలో జరిగింది. ఈ వారాహి యాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలంటూ బాలకృష్ణ, ఇతర టీడీపీ నేతలు పిలుపునిచ్చినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. గత మూడు విడతల వారాహి యాత్రలకంటే చాలా తక్కువగా అవనిగడ్డలో జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారని, వారి అసంతృప్తిని ఇది తేటతెల్లం చేస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.