తెలంగాణ వీణ , హైదరాబాద్ : ‘తెలంగాణలో జాకీలు పెట్టి లేపినా బీజేపీ లేవదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు’అని ఆరి్ధక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహావిష్కరణ, ఐఓసీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే.. మెదక్ జిల్లా రామాయంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఈసారి 100కు పైగా సీట్లతో బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షాలే కాదు ఎవరొచ్చినా బీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో.. ఆ పారీ్టలో రేవంత్‌రెడ్డి పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాకకు నయాపైసా నిధులు తీసుకురాలేదని, బీజేపీ గెలిస్తే ఏమవుతుందో ఇట్టే తెలుస్తుందని విమర్శించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.