తెలంగాణ వీణ , హైదరాబాద్ : త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల రెండో వారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాబోయే రెండు నెలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై చర్చించారు.అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ పాల్గొన్న పాలమూరు సభకు విశేషమైన ప్రజాదరణ లభించిందన్నారు. ఈ నెల 10 వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు.