తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోందని, అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీ స్కీంలంటూ మాయమాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌ను నమ్మితే ప్రజలకు మూడు గ్యారంటీలు మాత్రం పక్కాగా ఉంటాయన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పోవుడు, మూడు గంటల కరెంట్ వాపస్ వచ్చుడు గ్యారంటీగా జరుగుతుందన్నారు.
ఇక సంవత్సరానికి ఒక సీఎం చొప్పున ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు మారతారని పేర్కొన్నారు. సీల్డ్ కవర్‌లో ఢిల్లీ నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు దిగుతారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఆకాశం నుంచి పాతాళం దాకా ఏ టూ జెడ్ కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని అన్నారు. ‘ఓటుకు కోట్టు దొంగల చేతుల్లో ఉన్న ఆ పార్టీ ఇచ్చే హామీలకు గ్యారంటీ ఉందా?’అని ప్రశ్నించారు.
అది వారంటీ అయిపోయిన పార్టీ అని, అలాంటి పార్టీ ఇచ్చే హామీకి విలువ ఉంటుందా? ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. తొలుత ఆయన సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌తో పాటు పలు అభివృద్ధి పనులను మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నల్లగొండలో జరిగిన ప్రగతి నివేదన సభలోనూ పాల్గొన్నారు. ఈ రెండుచోట్లా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.