అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. గుజరాత్ రైతులు కూడా ఆయనను చూసి నవ్వుకుంటున్నారని చెప్పారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్లో 35 రూపాయలు కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. రైతు బంధు కింద రైతన్నలకు ఏడాదికి రూ.75 వేల కోట్లు ఇస్తున్నామని, గుజరాత్లో 10 రూపాయలైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.ప్రధాని మోదీ రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనడానికి యాదాద్రి పవర్ ప్లాంటే నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు ప్లాంటుకు అనుమతులు ఇవ్వలేదని విమర్శించారు. గుజరాత్లో, భారత్తో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి విద్యుత్ వైర్ పట్టుకుంటే తెలుస్తుందని వెల్లడించారు. 24 గంటల విద్యుత్ గురించి మాట్లాడే హస్తం పార్టీ నేతలు.. ఏ క్షణమైనా కరెంటు తీగలు పట్టుకోవచ్చన్నారు. కాగా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనికతతోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐటీ హబ్స్, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 12కు పన్నెండు ఎమ్మెల్యే స్థానాలను మరోసారి బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని స్పష్టం చేశారు.