తెలంగాణ వీణ , హైదరాబాద్ : నీ ఉద్దేశం మంచిదే అయితే.. నీకు నియ్యత్ ఉంటే గుజరాత్‌కో నీతి.. తెలంగాణకో నీతి ఉంటదా? నువ్వు గుజరాత్ ప్రధానివా? దేశానికి ప్రధానివా?’అని మోదీని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. అలాగే 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఐటీ, ఇండ్రస్టియల్ పార్కుల ఏర్పాటు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మంచిర్యాల జిల్లాలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామగుండం, పెద్దపల్లి, రామకృష్ణాపూర్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేటీఆర్ ప్రసంగించారు.
సింగరేణికి గనులు ఇవ్వలేదేం? రామగుండం, పెద్దపల్లి సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘ఏం ముఖం పెట్టుకొని ప్రధాని రాష్ట్రానికి వస్తున్నడు? ఇటీవల రామగుండం వచ్చిన మోదీ సింగరేణిని ప్రైవేటీకరించబోమని తియ్యని మాటలు చెప్పారు. కానీ ఆ తర్వాత నెల రోజులకే సింగరేణి బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టారు’అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వేలంలో పాల్గొని బొగ్గు బ్లాకులు దక్కించుకోవాలని మోదీ ఉచిత సలహా ఇచ్చారని పేర్కొన్నారు.
ప్రధానికి సింగరేణిపై ప్రేమ ఉంటే గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బొగ్గు గనులు ఎలా రాసిచ్చారో.. అదే పద్ధతిని సింగరేణికి ఎందుకు పాటించలేదని నిలదీశారు. ‘నాకు తెలుసు నీ కుట్ర.. ఏ ప్రభుత్వరంగ సంస్థ అయినా మంచిగ నడిస్తే.. దానిని నష్టాల్లోకి నెట్టేయాలి. ఆ తర్వాత నష్టాల్లోకి వచ్చిన సంస్థగా ముద్రవేసి నీ దోస్తులకు కట్టబెట్టాలి. అడ్డికి పావుసేరుకు అమ్మి అందులో చందాలు తీసుకోవాలి. ఇలా స్కీంలు పెట్టి ఒక్కో ప్రభుత్వరంగ సంస్థను అమ్ముతున్నారన్నారు.