తెలంగాణ వీణ , జాతీయం : కన్నడ నటుడు నాగభూషణ బెంగళూర్‌లో కారును వేగంగా నడుపుతూ ఓ జంటను ఢీ కొనడంతో మహిళ మరణించిన ఘటన కలకలం రేపింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహిళ ఆదివారం మరణించింది. బెంగళూర్‌లోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో నాగభూషణం వాహనం వసంతపుర మెయిన్‌రోడ్డు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న దంపతులను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో నటుడు ఉత్తరహళ్లి నుంచి కొననకుంటె వైపు వెళుతున్నారు. ఈ ఘటనలో మహిళ ప్రేమ (48) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె భర్త కృష్ణ (58)కు కాళ్లు, తల, పొట్టపై బలమైన గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో గాయపడిన జంటను నాగభూషణ స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు.