తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మోత మోగలేదు. హారన్ కొట్టలేదు.. విజిల్ వినిపించలేదు.. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు మద్దతుగా మోత మోగించాలంటూ టీడీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన కరువైంది. పార్టీ ఆఫీస్‌లో మినహా.. ఉమ్మడి జిల్లాలోని టీడీపీ శ్రేణులు తమకెందుకొచ్చిన తలనొప్పి అంటూ తప్పించుకున్నా రు. పార్టీ ఉంటుందా లేదా అనే సందేహంలో ఉన్న తరుణంలో ఇలాంటి పిచ్చి పిలుపులేంటంటూ నేతలు కార్యకర్తలతో చెప్పి అసహనం వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టు అంశాన్ని జనాల్లో నానుతూ ఉండేలా చేయాలని టీడీపీ ఎంత ప్రయత్నిస్తున్నా.. అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్వచ్ఛందంగా కంచాలు మోగించాలనీ, ఎక్కడ ఉంటే అక్కడ హారన్లు కొట్టాలనీ, విజిల్స్ వేస్తూ మోత మోగించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ విజయవంతం చేయాలంటూ టీడీపీ సీనియర్ నేతలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేశారు.