తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాజకీయ బహిరంగ సభలకు జనం రావాలంటే పార్టీపైనో, నాయకుడి పైనో అభిమానం ఉండాలి. లేదంటే ఆ పార్టీ నాయకుడి వల్ల ఆ ప్రాంతానికి ఏదైనా మేలు జరిగి ఉండాలి. అప్పుడే అభిమానంతో ఆ పార్టీ బహిరంగ సభలకు జనం వస్తారు. కానీ, ఈ విషయంలో బీజేపీ రూటే సపరేటు. తమ సభలకు జనం రాకున్నా సరే. . లక్షలాదిమంది వచ్చారని చెప్పేందుకు ఆ పార్టీ పడే తంటాలు చూస్తే నవ్వు రాకమానదు. సినీ ప్రమోషన్ల తరహాలో తమ బహిరంగ సభలకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ‘మేం లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం’ అని పాడిన పాటే పాడుతున్నది. మోదీ వచ్చినా, అమిత్ షా, నడ్డా.. ఇలా ఎంతమంది అగ్రనేతలు వచ్చినా సభకు వచ్చేది మాత్రం 10-15 వేలకు మించడం లేదు. ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. ఇరుకు ప్రాంగణంలో సభ పెట్టి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తమ సభకు జనం పోటెత్తినట్టు ప్రచారం చేసుకోవడం అలవాటైపోయింది.