తెలంగాణ వీణ , హైదరాబాద్ : మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి , క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితోపాటు రూ.500 కోట్లతో చేపట్టనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేస్తారు. మందమర్రిలో భారీ రోడ్ షో, రామకృష్ణాపూర్లో ప్రగతి నివేదన సభలో మంత్రి పాల్గొంటారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మందమర్రికి చేరుకుంటారు.
భీమారం మండలం పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.14.53 కోట్లతో నిర్మించే రోడ్లు, బ్రిడ్జిలు, చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో రూ.20.40 కోట్లతో నిర్మించే పది రోడ్ల పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిచనున్నారు. అనంతరం రూ.11.70 కోట్లతో పాలవాగుపై పులిమడుగు,అందుగులపేట, సండ్రూన్పల్లి దగ్గర మూడు చోట్ల బ్రిడ్జిలు, చెన్నూ ర్ పక్కన అక్కెపెల్లి వాగుపై బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మందమర్రి మండలం శంకరపల్లిలో రూ.500 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేయనున్నారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మార్కెట్ చౌరస్తాలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.