తెలంగాణ వీణ , హైదరాబాద్ : చారిత్రక నేపథ్యమున్న నిజాం వ్యాయామ కాలేజీకి మహర్దశ పట్టనున్నది. సీఎం కేసీఆర్ సూచనతో రూ.20 కోట్ల వ్యయంతో అధునాతన భవనం ప్రభుత్వం నిర్మించబోతున్నది. కొత్త భవనం నిర్మాణానికి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అందుకోసం తెలంగాణ రాష్ట్ర విద్య,సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఏర్పాట్లు చేస్తున్నది. వ్యాయామ విద్య ప్రాధాన్యాన్ని గ్రహించిన నాటి నిజాం పాలకులు హైదరాబాద్‌లోని దోమలగూడలో 11 ఎకరాల్లో దక్కన్ వ్యాయామ కళాశాలను 1931లో ఏర్పాటు చేశారు. కాలక్రమేణ అది ప్రభుత్వ వ్యాయామ కాలేజీగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒకే పిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీని గత పాలకులు పట్టించుకోలేదు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆ కాలేజీ భవితవ్యం గురించి సీఎం కేసీఆర్‌కు వివరించగా, తక్షణమే స్పందించారు. అత్యాధునిక వసతులతో కొత్త భవనం నిర్మించాలని, మరిన్ని హంగులతో క్రీడా మైదానాన్ని సైతం విస్తరించాలని ఆదేశించారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించే భవనంలో అత్యాధునికంగా పది తరగతి గదులు, సైకాలజీ అనాటమీ ల్యాబ్, ఫిజియోథెరపీ ల్యాబ్, ఫస్ట్ ఎయిడ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అడియో వీడియో విజువల్ ల్యాబ్, జిమ్ రూం, గేమ్స్ ఎక్విప్‌మెంట్ స్టోర్ రూం, యోగా ప్రాక్టీస్ హాల్, లైబ్రరీ, ఎగ్జామినేషన్ రూం, ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్ రూంలు ఉంటాయి. మరో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గర్ల్స్ హాస్ట ల్ భవనం, కిచెన్, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. రన్నింగ్ ట్రాక్, బాస్కెట్ బాల్ కోర్ట్, స్విమ్మిం గ్ పూల్ ఏర్పాటు కానున్నాయి. ఈ కాలేజీలో డీపీఈడీ, బీపీఈడీ కోర్సులు ఉన్నాయి. ఏటా 500 మంది విద్యనభ్యసిస్తారు.
నిజాం వ్యాయామ కాలేజీకి మహర్దశ
