తెలంగాణ వీణ , జాతీయం : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరు రోజుల పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లలో మెగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శనివారం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 వరకు ఆయా రాష్ట్రాల్లో ఎనిమిది ర్యాలీలు నిర్వహిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన వివిధ ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించనున్నారు.
భారతీయ జనతా పార్టీ కి చెందిన రెండు ‘పరివర్తన్ యాత్రల’ ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సైన్స్ కళాశాల మైదానంలో జరిగే ‘పరివర్తన్ మహాసంకల్ప’ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తారని రాష్ట్ర బీజేపీ చీఫ్ అరుణ్ సావో తెలిపారు. అక్టోబరు 3న బస్తర్‌లోని జగదల్‌పూర్‌లో బహిరంగ సభలకు హాజరవనున్నారు.
అక్టోబర్ 1న, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న మోదీ, అక్కడ రూ.13 వేల 500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ మార్గాల్లో రైలు సర్వీసులను, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని ఐదు కొత్త భవనాలను కూడా ప్రారంభిస్తారు. అక్టోబరు 3న నిజామాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అక్టోబర్ 2న, మోడీ మధ్యప్రదేశ్‌లో ఒక రోజు పర్యటించనున్నారు, అక్కడ గ్వాలియర్‌లో రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అక్టోబర్ 6న జోధ్‌పూర్‌ను సందర్శిస్తారు. అనంతరం జబల్‌పూర్, జగదల్‌పూర్‌లలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
అక్టోబర్ 2న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. చిత్తోర్‌గఢ్‌లో భారీ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు.
తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. రేపు(ఆదివారం) మహబూబ్‌నగర్‌కు మోదీ విచ్చేయనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ క్రమంలో సభా ఏర్పాట్లు స్థానిక తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు పరిశీలించారు.
ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ కుటుoబoపై వ్యతిరేకత కనిపిస్తోంది. అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి.. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారు. కేసీఆర్‌లా ఫామ్‌హౌజ్‌లో ఉండటానికి మోదీ తెలంగాణకు రావడం లేదు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుoబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదు.