తెలంగాణ వీణ , జాతీయం : పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న పదిమంది కలైమామణి అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ‘సాహిత్య సంగీత, నాటక మండ్రం’ ఆధ్వర్యంలో తలా రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) శుక్రవారం ఉదయం ఆర్థికసాయం అందించారు. సచివాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు కె.కళ్యాణసుందరం, ఎస్.సముద్రం, ఎన్.పార్వతి ఉదయం, కె.కుమారవేల్, పి.ముత్తుచంద్రన్, కె.ముత్తులక్ష్మి, పీఆర్ దురై, ఆర్. కల్యాణసుందరం, ఎం.ఎస్. మహమ్మద్ మస్తాన్, టీఎన్ వరలక్ష్మిలకు నగదు అందించారు. ఇదే విధంగా రాష్ట్ర జానపద కళాకారుల సంక్షేమ సంస్థలో సభ్యులుగా ఉన్న 500 మంది కళాకారులకు సంగీత వాద్య పరికరాలు, దుస్తులు, ఆభరణాలు కొనుగోలుకు తలా రూ.10వేలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధ కళాకారులకు ప్రతినెలా రూ.3వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు గతంలో అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు శుక్రవారం 1000 మందికి రూ.3వేల నెలసరి భత్యాన్ని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర సాహిత్య సంగీత నాటక మండ్రం ఈ నెలసరి భత్యాన్ని క్రమం తప్పకుండా ప్రతినెలా అందిస్తుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సామినాథన్, రాష్ట్ర సాహిత్య సంగీత నాటక మండ్రం అధ్యక్షుడు, సినీ నటుడు వాగై చంద్రశేఖర్, సభ్యురాలు విజయా తాయన్బన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, పర్యాటక దేవాదాయ శాఖల ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్ తదితరులు పాల్గొన్నారు.