తెలంగాణ వీణ , జాతీయం :తెలంగాణ వీణ , జాతీయం : స్కూల్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న టీచర్లు వాటిని లైక్ చేసి షేర్ చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలల టీచర్లు విద్యార్థులను గాలికి వదిలేసి రీల్స్ షూట్ చేయడంలో బిజీగా గుడుపుతున్నారు. ఆపై వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ.. సబ్‌స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
స్కూలుకు వచ్చింది మొదలు వెళ్లేంత వరకు వారు ఇదే పనిగా గడుపుతున్నారు. ఓ టీచర్ రీల్స్ చేస్తుంటే మరో టీచర్ దానిని కెమెరాలో షూట్ చేస్తున్నారు. స్కూలుకు రావడం ఆలస్యం అన్నట్టు వచ్చీ రావడమే రీల్స్‌కు రెడీ అయిపోతున్నారు. ‘రవిపూజా’ అనే ఖాతాలో రీల్స్ పోస్టు చేస్తున్న టీచర్ స్కూల్‌లోనే వాటిని చిత్రీకరిస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాదు, సబ్‌స్క్రైబ్ చేసుకోకుంటే కొడతానని కూడా బెదిరిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆమె కోసం వంట, టీ చేయడం వంటి వాటిని కూడా పురమాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కలెక్టర్‌ను కలిసి ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్‌లో రీల్స్ వ్యవహారంపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వర్ ఆర్తి గుప్తా దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్లో రీల్స్ రికార్డ్ చేస్తున్న టీచర్లను అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్‌గా గుర్తించారు. అయితే, వారు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. పిల్లలు నేర్చుకుంటారని కొన్నిసార్లు మాత్రం వీడియోలు చేసినట్టు చెప్పడం గమనార్హం.