తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : విశాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపునకు సంబంధించి మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. దసరా నాటికి విశాఖకు సీఎం కార్యాలయాన్ని మార్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. దసరాకు ఒక రోజు ముందు.. అంటే అక్టోబర్ 23న విశాఖలో క్యాంపు కార్యాలయం పూజకు ముహూర్తం బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశాయి. విశాఖలో ఏర్పాట్లు ఓ కొలిక్కి రావడంపై సీఎం షెడ్యూల్ ఆధారపడి ఉంటుందని తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.