తెలంగాణ వీణ , హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబన్–14లోని నందినగర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడు సంవత్సరాల నుంచి ఈ రోడ్డును నిర్మించాలని స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కేన్సర్ హాస్పిటల్ వెనుక ఉన్న ఈ రోడ్డు మీదుగా సీఎం కేసీఆర్ తన స్వగృహానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓ వైపు హాస్పిటల్‌కు వచ్చే రోగులు వారి సహాయకులతోనూ షాపింగ్‌లకు వచ్చే వారితోనూ ఈ ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
దీనికి తోడు పక్కనే ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చే భక్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు చేసినా ఫలితం లేదు. ఈ రిపేర్ల వల్ల రోడ్డు మరింత శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రూపురేఖలు మారిపోయి చెరువులా తయారైంది. చిన్నపాటి వర్షం పడినా రోడ్డు నీటితో నిండిపోతోంది. అధికారులు ఇప్పటికై నా స్పందించి ఈ మార్గంలో కొత్త రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.