తెలంగాణ వీణ ,సిటీ బ్యూరో : వారిద్దరూ అన్నోన్య దంపతులు. ఐదు దశాబ్దాలపాటు ఒకరినొకరు విడిచి ఉండలేదు. ఉన్న కొద్దిపాటి ఆదాయంతో సంతోషంగా కాలం గడిపేవారు. అకస్మాత్తుగా భర్త చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తూ భార్య కుప్పకూలి మృతిచెందిన ఘటన రాజోళి మండలంలోని పచ్చర్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పచ్చర్లకు చెందిన డబ్బ లక్ష్మీరెడ్డి (70) గద్వాల మండలం పాల్వాయి చెందిన శంకరమ్మతో 50 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ పోషణ కోసం గద్వాలకు మకాం మార్చారు.
గద్వాలలోని హెడ్ పోస్టాఫీసు సమీపంలో భోజనం హోటల్ నిర్వహిస్తూ వచ్చే ఆదాయంతో కొడుకులు, కోడళ్లు, మనవళ్లు మనవరాళ్లతో కాలం గడుపుతున్నారు. సంతోషంగా జీవిస్తున్న వారి జీవితంలో పదేళ్ల క్రితం చిన్న కుమారుడు ఎల్లారెడ్డి అకస్మాత్తుగా మృతిచెందాడు. కోడలు, వారి పిల్లల బాధ్యతతో పాటు పెద్ద కుమారుడు, వారి కుటుంబభారం వీరిపై పడింది. అందరూ ఒక చోట ఉండటంతో ఎన్ని కష్టాలు వచ్చినా దిగమింగుతూ కాలం గడుపుతూ వచ్చారు. గురువారం తెల్లవారుజామున లక్ష్మీరెడ్డి అకస్మాత్తుగా మృతిచెందడంతో భార్య శంకరమ్మ ఎడబాటును భరించలేకపోయింది
ఉదయం నుంచి విలపిస్తూ కన్నీటి పర్యంతమైంది. స్వగ్రామమైన పచ్చర్లకు అంత్యక్రియలకోసం మృతదేహాన్ని తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా భర్తకు మట్టి ఇస్తూ శంకరమ్మ(65) శ్మశానంలోనే కుప్పకూలి పడిపోయింది. చికిత్స నిమిత్తం హుటాహుటిన కర్నూలుకు తరలించారు. మార్గమధ్యంలో ఆమె తనువుచాలించింది. దీంతో బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. శంకరమ్మ మరణవార్త విని తల్లడిల్లిపోయారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు చేసి వెళ్తామని కుటుంబ సభ్యులు ఉండిపోయారు.