తెలంగాణ వీణ , జాతీయం :పాకిస్థాన్‌లో రాజకీయ ప్రత్యర్థులు టీవీ ఛానల్ లైవ్‌లో పరస్పరం భౌతిక దాడి చేసుకున్నారు. పీటీఐ న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, పీఎంఎల్-ఎన్ సెనేటర్ అఫ్నానుల్లా ఖాన్ ప్రత్యక్ష ప్రసార సమయంలోనే గొడవకు దిగారు. వారిద్దరు ఒకరినొకరు చెంపలు వాయించుకోవడం, దాడి చేసుకోవడం చేశారు. వారిని వేరు చేసేందుకు టీవీ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో ఓ టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఈ రెండు పార్టీల ప్రతినిధుల మధ్య ఓ అంశంపై చర్చ వాగ్యుద్ధానికి దారి తీసింది. ఆ తర్వాత అది ఒకరినొకరు భౌతికదాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇరువురు నేతలు పరస్పరం దుర్భాషలాడుకున్నారు.
పీటీఐ న్యాయవాది మార్వాత్ తొలుత పీఎంఎల్-ఎన్ సెనేటర్ ఖాన్ పై దాడి చేశారు. దీంతో ఖాన్ అతనిని నెట్టివేయడంతో పరస్పరం దెబ్బలాడుకున్నారు. టీవీ సిబ్బంది వారిని విడదీశారు. అఫ్నానుల్లా ఖాన్ ఈ సంఘటనపై ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పీటీఐ నాయకుడికి తాను గట్టిగా బుద్ధి చెప్పానని, ఇది ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు కూడా గుణపాఠంగా మారుతుందన్నారు.