తెలంగాణ వీణ , జాతీయం : బీజేపీతో ఇక పొత్తు ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి స్పష్టం చేశారు. రాయబారాలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. బీజేపీ కూటమికి అన్నాడీఎంకే బై..బై చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా రాజకీయ నాటకంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ పెద్దలు అన్నాడీఎంకే వ్యవహారంలో మౌనంగా ఉండడమే కాకుండా పరిస్థితులను నిశితంగా వీక్షిస్తున్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలు అయితే ఢిల్లీ పయనానికి రెడీ అవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీ పెద్దలతో చర్చించాల్సిన అంశాల గురించి స్థానిక నేతలతో నీలగిరులలో తిష్ట వేసి సమావేశాల్లో మునిగి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కృష్ణగిరిలో గురువారం కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తప్పుడు ప్రచారాలు, ఆధార రహిత ఆరోపణలు, విమర్శల కారణంగానే ఆ పార్టీ కూటమినుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. తమ నేతలు జయలలిత, అన్నాదురై, పళణి స్వామిని విమర్శించే అర్హత అన్నామలైకు లేదన్నారు.
దివంగత నేతలు అన్నా, జయలలిత జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వాళ్లు అని, అయితే, వారినే టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ ముక్త కంఠంతో ఇచ్చిన ఆదేశాలను తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆలకించి, కూటమి విషయంలో అమలు చేశారన్నారు. అన్నామలైను బీజేపీ నుంచి తొలగించాలని తాము ఎవరి వద్ద ఫిర్యాదులు చేయలేదు, విజ్ఞప్తులు పెట్టలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మళ్లీ కూటమిలోకి వెళ్తామన్నట్లు ప్రచారం జరుగుతోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.