తెలంగాణ వీణ , జాతీయం : కావేరి జల వివాదాన్ని పరస్పరం చర్చలతో న్యాయ స్థానం వెలుపల పరిష్కరించుకోవాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ చేసిన సూచనను బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్ స్వాగతించారు. ఈ దిశలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో చర్చించేందుకు చెన్నైకు వెళ్లిన ఆయన రెండు రోజుల పాటు ఎదురు చూసి అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో నిరాశతో గురువారం వెనుదిరిగారు. బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 48 గంటల పాటు స్టాలిన్‌ను భేటీ అయ్యేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. చెన్నైలో డీఎంకే ఎంపీలు, ఇతర నేతలతోనూ, బీజేపీ నేతలతోనూ జరిపిన చర్చలు ఒకింత సంతృప్తినిచ్చాయన్నారు. కావేరి జల వివాదం సామరస్యపూరితంగా పరిష్కారం కావాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. ఈ దిశలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో చర్చించేందుకు చొరవ తీసుకోవాలని, తద్వారా ప్రాంతీయ సంఘర్షణ ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కర్ణాటకలో అన్నదాతలు కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న తరుణంలో కావేరి జల వివాదం ఏర్పడటంతో మానవతాదృష్టితోనే తమిళనాడు సీఎం భేటీ కోసం ప్రయత్నించానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోరాదని, రాజకీయాలను పక్కన పెట్టాలని ఆయన హితవు పలికారు.