తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఆశయ స్ఫూర్తితోనే వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జాషువా జయంతిని గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు.
మంత్రి నాగార్జున మాట్లాడుతూ సమాజంలో అనేక అవమానాలు, వివక్షను ఎదుర్కొని ఎదిగిన మహాకవి జాషువా అని కొనియాడారు. సమాజాన్ని మేల్కొలిపేలా రచనలు చేశారని చెప్పారు. ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఉన్నతమైన ఆయన రచనలు గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి వంటి వాటిని అన్ని భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాషువా స్ఫూర్తితో దళిత వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. నందిగం సురేష్ మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా తనదైన శైలిలో సమాజాన్ని మేల్కొల్పిన మహనీయుడు జాషువా అని చెప్పారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్‌ల చైర్‌పర్సన్‌లు, డైరెక్టర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.