తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హన్మంతరావు ఎపిసోడ్ రచ్చ రేపుతున్నది. మల్కాజిగిరి టికెట్‌ను మైనంపల్లికే ఇస్తారన్న ప్రచారాన్ని డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త నాయకుడి కోసం ఒక బీసీ నేతను బలి చేస్తారా? అనే వాదన తెర మీదకు తెస్తున్నారు.
తనకు టికెట్ ఇవ్వకుంటే కచ్చితంగా పోటీలో ఉంటానని, అధిష్ఠానం నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానని ఇప్పటికే స్పష్టంచేసిన నందికంటి శ్రీధర్.. తాజాగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. గురువారం రాత్రి మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోగా, అంతకుముందే పలువురు మల్కాజిగిరి కాంగ్రెస్ నేతలు అల్వాల్ సర్కిల్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, నందికంటి శ్రీధర్‌కు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్‌లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం లభించడం లేదని విమర్శించారు. శ్రీధర్‌కు టికెట్ కేటాయించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్తే విషయం దాటవేశారని అన్నారు. టికెట్ల కేటాయింపు ఢిల్లీ అధిష్ఠానం చూసుకుంటుందని రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తున్నట్టు రేవంత్‌రెడ్డి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. జిల్లా పార్టీ అధ్యక్షునికే టికెట్ ఇవ్వకపోతే మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోతుందని అన్నారు.
సమావేశంలో పార్టీ సర్కిల్ అధ్యక్షుడు నిమ్మ కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, సీఎల్ యాదగిరి, డోలి రమేశ్, డివిజన్ అధ్యక్షుడు సూర్య ప్రకాష్‌రెడ్డి, పవన్‌కుమార్, సంజీవ్‌కుమార్, రాజు, ప్రభాకర్, సంతోష్‌రెడ్డి, శివకుమార్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్, మహిళా అధ్యక్షురాలు వీసన్ మేరి, పద్మ, నిర్మల, సభాషిణి, విజయ తదితరులు పాల్గొన్నారు.