తెలంగాణ వీణ , హైదరాబాద్ : మొండి చేయికి ఓటేస్తే బతుకులు ఆగమైతయ్. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం అంధకారమైపోద్ది’ అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. 65 ఏండ్లు పాలించి రూ.200 పింఛన్ ఇయ్యనోడు రూ.4 వేలు ఇస్తా.. రూ.40 వేలు ఇస్తానంటూ అడ్డం పొడువు నరుకుతుండ్రని, అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వడానికి చేతకాని వాళ్లను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తదా? అని నిలదీశారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్‌తో ఏడాదికో ముఖ్యమంత్రిని మారుస్తారని. ఐదుగురు కృష్ణులు గ్యారెంటీ అని, ఎప్పుడు ఎవరు దిగుతాడో తెలియదని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు.
మండల కేంద్రంతోపాటు కోళ్లమద్ది, లింగన్నపేట, నర్మాల గ్రామాల్లో 369 డబుల్ బె డ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం నమాజ్‌చెరువు పక్కన మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 11 సార్లు ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు కనీసం కరెంటు, తాగునీళ్లు, సాగునీరిచ్చే తెలివిలేదని, పింఛను ఇచ్చే ముఖం లేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ అంటే వాళ్లు రూ.2 లక్షలు ఇస్తమమంటున్నరని, 24 గంటల కరెంటు ఇస్తామంటే 48 గంటలని చెప్తున్న కాంగ్రెసోళ్ల కల్లబొల్లి మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. వాళ్లు ఇచ్చేది లేదు.. సచ్చేది లేదని, గందరగోళం సృష్టించి నాలు గు ఓట్లు డబ్బాలో వేసుకుని అవతల వడాలన్నదే వాళ్ల నీతి అని విమర్శించారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల నుంచి పైసలు తెచ్చి ఇక్కడ పంచి తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సీజన్ వచ్చిందని, కాంగ్రెసోల్లు, బీజేపోళ్లు పైసలు ఇచ్చినా తీసుకోండ్రి కానీ, ఇమానాలు, ప్రమాణాలు చేయవద్దని, ఓటు మాత్రం తప్పకుండా మీకు పనిచేసే కేసీఆర్ ప్రభుత్వానికే వేయాలని విజ్ఞప్తి చేశారు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీయాలని కేటీఆర్ సూచించారు.