తెలంగాణ వీణ, జాతీయం : ఆర్మీ క్యాంపులో పనిచేస్తున్న భర్త కనిపించకుండా పోవడంతో ఆయన భార్య ఆందోళన చేపట్టింది. అదే ఆర్మీ క్యాంప్ ముందు కూర్చుని తన భర్తను తీసుకొచ్చేదాకా కదలబోనని తేల్చిచెప్పింది. ఆమెకు మద్దతుగా స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. మణిపూర్ లోని కాంగ్ పోక్పి జిల్లాలోని లేమాఖోంగ్ ఆర్మీ క్యాంప్ వద్ద చోటుచేసుకుందీ ఘటన. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ఈ ఘటన మరోమారు ఉద్రిక్తతలను పెంచింది.
మెయితీ వర్గానికి చెందిన లైశ్రామ్ కమాల్ బాబు (55) లేమాఖోంగ్ ఆర్మీ క్యాంప్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 25న క్యాంప్ లో విధులకు హాజరైన బాబు. సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదని ఆయన భార్య బేలారాణి చెప్పారు. దీనిపై ఆర్మీ క్యాంప్ అధికారులను సంప్రదించగా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఐదు రోజులుగా తన భర్త ఆచూకీ లేదని, ఆయనను వెతికి తీసుకురావాలని ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతుండడం, ఇటీవల కనిపించకుండా పోయిన ఓ కుటుంబం ఆ తర్వాత శవాలుగా మారడం తనను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని వాపోయింది.తన భర్తను వెతికి తెచ్చే వరకు కదలబోనని ఆర్మీ క్యాంప్ ముందు బేలారాణి బైఠాయించింది. ఆమెకు మద్దతుగా స్థానిక మహిళలు కూడా ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసి మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ స్పందించారు. బాధితురాలి భర్తను వెతికి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలంటూ ఆర్మీని కోరారు. కాగా, కమాల్ బాబు కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.