తెలంగాణవీణ, సినిమా : సీనియర్ నటి సీత ఇంట్లో ఓ బంగారు ఆభరణం చోరీకి గురైంది. ఆమె విరుగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. రెండున్నర సవర్ల నగ ఒకటి కనిపించకపోవడంతో ఎవరో తెలిసిన వారే అపహరించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ అదే విషయాన్ని పేర్కొంది. ఇంట్లో ఉన్న మిగతా నగలు అన్ని ఉండగా, రెండున్నర సవర్ల జిమ్మీ ఒక్కటి మాత్రమే కనిపించడం లేదని చెప్పింది. తనకు తెలిసిన వారు లేదా ఇంట్లో పని చేసే వారిలో ఎవరో తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ సీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటి సీత ఇంట్లో జరిగిన ఈ చోరీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రజనీకాంత్, విజయకాంత్ తదితర అనేక మంది ప్రముఖ నటులతో కలిసి నటించిన సీత .. ప్రస్తుతం తమిళ సినిమాలలో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తోంది. రెండో భర్త సతీశ్ నుంచి కూడా విడిపోయిన నటి సీత.. విరుగం బాక్కంలోని పుష్పకాలనీలో నివాసం ఉంటున్నారు. ఇక, సీత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషా చిత్రాలలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపైనా అనేక సీరియల్స్‌లో సీత నటించింది.