తెలంగాణ వీణ, జాతీయం : తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. పళని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ దర్శకుడు జి.మోహన్‌ను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. చెన్నైలో ఆయనను అరెస్ట్ చేసిన తిరుచ్చి జిల్లా సైబర్ క్రైం పోలీసులు తిరుచ్చి తరలించారు. పంచామృతంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అరెస్టుకు కారణంగా తెలుస్తుండగా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు త్వరలోనే దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కాగా, తమిళ స్టార్ నటుడు విజయ్‌పైనా మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ వన్నారపేట, తిరేలపతి, రుద్రతాండవం, భాగసూరన్ వంటి చిత్రాలకు మోహన్ దర్శకత్వం వహించారు. మోహన్ అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అశ్వథామన్ సోషల్ మీడియా పోస్టు ద్వారా నిర్ధారించారు. అయితే, కారణం ఏమిటనేది తనకు తెలియదని పేర్కొన్నారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారన్నదానిపై ఆయన కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు.