తెలంగాణవీణ జాతీయం :‘‘దేవుళ్లమని మనకు మనం స్వయంగా ప్రకటించుకోకూడదని.. ఆ విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తార’’ని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. 1971లో కీలక నేత శంకర్ దిన్‌కర్ కానే (భయ్యాజీ) మణిపుర్‌లో చేసిన సేవలను స్మరించుకొంటూ పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మెరుపులా మెరవాలని కోరుకుంటారు. కానీ, పిడుగు పడిన తర్వాత మరింత చీకటిగా మారుతుందని వారు గుర్తించరన్నారు. కార్యకర్తలు ఒక దీపంలా .. అవసరమైనప్పుడు నిలకడగా వెలుగునివ్వాలన్నారు. శంకర్ దిన్‌కర్ 1971లో మణిపుర్‌లో చిన్నారుల విద్య కోసం తీవ్రంగా కృషి చేశారు. అక్కడినుంచి విద్యార్థులను మహారాష్ట్రకు తీసుకొచ్చి వారికి బస ఏర్పాటుచేసి బోధనా సౌకర్యాలు కల్పించారు.మణిపుర్ సంక్షోభంపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడ పరిస్థితి సంక్లిష్టంగా, సవాలుగా మారిందని అభివర్ణించారు. ఈ పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్‌ఎస్ వాలెంటీర్లు ఈశాన్య రాష్ట్రంలో బలంగా నిలిచారన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భద్రతకు ఎటువంటి హామీ లేకుండా పోయిందన్నారు. స్థానికులే వారి సెక్యూరిటీ విషయంలో సందేహాలు వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. ఇక వ్యాపారాలు, సేవా కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘ్ అక్కడే ఉండి.. శాంతిని నెలకొల్పేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. సాధారణ ఎన్‌జీవోలు చేయలేని పనిని సంఘ్ చేస్తోందని మోహన్ భగవత్ వెల్లడించారు. సంక్షోభ పరిష్కారానికి ఉన్న అన్ని అవకాశాలను తమ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు. వివాదంలో అన్ని పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మణిపుర్ అల్లర్లలో 200 మంది చనిపోగా.. దాదాపు 60,000 మంది నిరాశ్రయులయ్యారు.