తెలంగాణవీణ జాతీయం :తాను ఎలాంటి బెదరు లేకుండా ఆడేలా టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ సాయం చేసినట్లు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వెల్లడించాడు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే గంభీర్ నుంచి జట్టుకు పూర్తి మద్దతు లభించిందన్నాడు. ‘‘శ్రీలంక సిరీస్ సందర్భంగా నేను గంభీర్‌తో మాట్లాడాను. ‘మీదైన శైలిలో మైదానంలో ఆడి ఆటను ఎంజాయ్ చేయండి.. మీకు అండగా ఉంటాము’ అని అతడు పేర్కొన్నాడు. ఆ మాటలు మాలో ఆత్మవిశ్వాసం నింపి నిర్భయంగా ఆడేలా చేశాయి’’ అని యశస్వి పీటీఐకి వెల్లడించాడు. ప్రస్తుతం జైస్వాల్ వన్డేల్లో సత్తా చాటేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. సంసిద్ధతకు దేశవాళీ టోర్నీలు కీలకం అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధమయ్యేందుకు దేశవాళీ టోర్నీలు చాలా కీలకమని యశస్వి అభిప్రాయపడ్డాడు. ‘‘దులీప్ ట్రోఫీ, బంగ్లాదేశ్ సిరీస్‌ల కోసం నేను నెట్స్‌లో చాలా శ్రమిస్తున్నాను. వ్యక్తిగత గోల్స్ కోసం కాదు.. నిలకడగా రాణించేందుకే ఇలా చేస్తున్నాను. క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ.. మెరుగుపడటం చాలా కీలకం. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీలు అంతర్జాతీయ మ్యాచ్‌ల సంసిద్ధతకు చాలా కీలకం. కీలక మ్యాచ్‌ల ముందు ఇలాంటి టోర్నీలు నాలో ఆత్మవిశ్వాసం నింపుతాయి. నా పరిధిలో అత్యుత్తమంగా ఆడి జట్టు విజయాలను అందించడానికి యత్నిస్తాను. దులీప్ ట్రోఫీ వంటి టోర్నీలో చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. టెస్ట్ సిరీస్‌ల ముందు ఇలాంటివి చాలా ఉపకరిస్తాయి’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరఫున బరిలోకి దిగిన జైస్వాల్ కేవలం 30 పరుగులు మాత్రమే చేసి ఇండియా ఎ బౌలర్ ఖలీల్ అహ్మద్‌కు వికెట్ సమర్పించుకొన్నాడు. బెంగళూరు చెన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.