తెలంగాణవీణ జాతీయం:మొబైల్ ఫోన్ అధికంగా వినియోగిస్తే మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా…? ఈ అంశంపై చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిపై కొన్ని అపోహలూ జన బాహుళ్యంలో ఉన్నాయి. గతంలో పరిమిత డేటాతో వెలువడిన కొన్ని అధ్యయనాలు… మొబైల్ ఫోన్ రేడియో తరంగాలతో మెదడు క్యాన్సర్‌కు కారకమయ్యే గ్లియోమా కణితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ అపోహలను తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేయించిన అధ్యయనం పటాపంచలు చేసింది. డబ్ల్యూహెచ్‌వో తరఫున ఈ పరిశోధనను ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ (ఏఆర్‌పీఏఎన్‌ఎస్‌ఏ) చేసింది. ఈ ఏజెన్సీ.. సమగ్రంగా అధ్యయనం చేసి, భారీస్థాయి డేటాను విశ్లేషించి మొబైల్ ఫోన్ల వినియోగానికి, మెదడు క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దాదాపు 5 వేల అధ్యయనాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చింది.గత రెండు దశాబ్దాల నుంచి వైర్‌లెస్ సాంకేతికత విపరీతంగా పెరిగిందని, అయితే ఆ స్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల నమోదు కాలేదని పేర్కొంది. 2011 మేలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ) ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. అందులో రేడియో తరంగాలకు గురి అయితే క్యాన్సర్ సంభవించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. వైర్‌లెస్ ఫోన్ వినియోగంతో బ్రెయిన్ క్యాన్సర్‌కు కారణమైన గ్లియోమా కణితి ఏర్పడొచ్చని తెలిపింది. ఆ పరిశోధనకు ఆధారాలు అంతంతమాత్రమే. పరిమిత డేటాతోనే ఆ అధ్యయనం ప్రచురితమైంది. తాజా పరిశోధనలో ఏఆర్‌పీఏఎన్‌ఎస్‌ఏ భారీస్థాయిలో డేటాను విశ్లేషించింది. ఇటీవల ఈ అంశంపై జరిగిన అధ్యయనాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. సమగ్రంగా పరిశీలించింది. అనంతరం వైర్‌లెస్ సాంకేతికతతో వెలువడే రేడియో తరంగాలు మానవ ఆరోగ్యానికి హాని కలిగించేవి కావని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాలతో మెదడు క్యాన్సర్‌కు కారకమయ్యే గ్లియోమా కణితి వచ్చే అవకాశం లేదని, ఇతర మెదడు సంబంధిత క్యాన్సర్లు కూడా రావని తేల్చి చెప్పింది. ఈ అధ్యయనాన్ని ‘ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్’ జర్నల్ ప్రచురించింది.