తెలంగాణవీణ ఏపీ బ్యూరో :ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్కు అందజేయనున్నట్టు వెల్లడించారు. విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వం తీరువల్లే ఈ ఇబ్బందులు..‘‘ప్రస్తుతం వరద తగ్గుతోంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. గత ప్రభుత్వం తీరువల్లే ఈ ఇబ్బందులు. పెద్ద ప్రమాదం తప్పింది. సహాయం కోసం 112, 1070, 18004250101 ఫోన్ చేయండి. ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనేది మంత్రివర్గంలో చర్చిస్తాం. ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. వరద నిర్వహణ కోసం బృహత్తు ప్రణాళిక తయారు చేస్తాం. వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా. కానీ, నా వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావిస్తున్నా. నా పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు. వరద సమయంలో మా శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది. నేను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప.. మరొకటి కాదు’’అని పవన్ కల్యాణ్ అన్నారు.