తెలంగాణవీణ జాతీయం : మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం తయారీకి స్టెయిన్‌లెస్ స్టీల్ వాడితే అది ఎప్పటికీ కూలి ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. సముద్ర తీరానికి దగ్గరగా నిర్మించే బ్రిడ్జిల నిర్మాణంలో స్టెయిన్‌లెస్ స్టీల్ వినియోగించాలని ఆయన సూచించారు.‘‘నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ముంబయిలో 55 ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాము. ఆ సమయంలో ఓ వ్యక్తి నాకు వాటిని చూపించడానికి తీసుకువెళ్లాడు. అక్కడ వారు ఇనుపకడ్డీల మీద కొన్ని పౌడర్-కోటింగ్‌లు వేస్తూ అవి మళ్లీ తుప్పు పట్టే అవకాశం లేదని చెప్పారు. కాని అవి తుప్పు పట్టే అవకాశం ఉందని నేను అప్పుడే చెప్పాను. సముద్రానికి దగ్గరగా నిర్మించే వంతెనల నిర్మాణంలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపయోగించాలని గత మూడేళ్లుగా ఒత్తిడి చేస్తూనే ఉన్నాను. శివాజీ విగ్రహాన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేసి ఉంటే అది కూలిపోయేది కాదు’’ అని గడ్కరీ అన్నారు. గతేడాది నేవీ డే (డిసెంబరు 4) సందర్భంగా రాజ్‌కోట్ కోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 35 అడుగుల శివాజీ విగ్రహం సోమవారం నిలువునా కూలిన విషయం తెలిసిందే. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్లుగా మొదట అధికారులు అనుమానించారు. అయితే విగ్రహం కూలడానికి ఆరు రోజుల ముందే విగ్రహమంతా తుప్పుపట్టి ఉందని, దీనికి శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని సూచిస్తూ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ, నేవీ అధికారులకు తెలియజేసింది. కాగా విగ్రహశిల్పి జయదీప్ ఆప్టే పరారీలో ఉండటంతో సింధుదుర్గ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌ను అరెస్ట్ చేశారు.