తెలంగాణవీణ ఏపీ బ్యూరో : భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. 50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. ఇప్పటికే నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ -మీ నందమూరి బాలకృష్ణ