తెలంగాణవీణ జాతీయం :టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. నిరసనలు, అల్లర్లతో తమ దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో.. స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. పాక్‌పై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. ఓపెనర్లు జకీర్ హసన్ (40), షాద్మాన్ ఇస్లామ్ (24), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), ముష్పీకర్ రహీమ్ (22), షకీబ్ అల్ హసన్ (21) రాణించారు. పాక్ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 274 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో లిటన్ దాస్ (138), మెహదీ హసన్ మిరాజ్ (78) ఆదుకోవడంతో 262 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్లు హసన్ మహ్మద్ (5/43), నహీద్ రాణా (4/44) విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 172కే కుప్పకూలింది. సల్మాన్ ఆఘా (47 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్ (43) పోరాడకపోతే పాక్ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.