Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఈ క్రిమినల్స్‌ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్‌ పెట్టాం:

Must read

తెలంగాణవీణ ఏపీ బ్యూరో : ‘జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఫీల్డ్‌కు వచ్చారా? ఓసారి వరద ప్రాంతాల్లో రెడ్‌కార్పెట్‌పై సందర్శించారు. ఇప్పుడు విధిలేక బురదలో దిగారు. బుడమేరు డ్రైన్‌కు గండ్లు పడ్డాయని వాళ్లకు తెలియదు. దీనికి గేట్లు ఉన్నాయని ఆయన మాట్లాడతారు. ఆయనెలా సీఎం అయ్యారో అర్థం కావడం లేదు. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపామంటారా? ఎంత అజ్ఞానం? ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? ఇదేం చెత్త రాజకీయాలు? పేదలకు ఇబ్బందులున్నప్పుడు వెకిలిగా మాట్లాడుతున్నారు. వాళ్లే నేరాలు చేసి, వేరే వారిపై వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు! తుపాను సాయం, విపత్తును ఎదుర్కోవడంపై మాట్లాడే అర్హత జగన్‌కు ఉందా?’ అని వైకాపా అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బోట్లు ఢీకొనడంపై అనుమానాలు?‘కొందరు క్రిమినల్స్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజూ అనుమానాలు వస్తాయి. రెండు బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. ఓ విధంగా అది ప్రమాదమే. దీనిలో కుట్ర ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. వివేకాను హత్యచేసి గుండెపోటు అని చెప్పినవారు ఇలా కూడా చేయొచ్చేమో? రేపల్లె వద్ద బండ్‌కు ఈ క్రిమినల్స్‌ గండ్లు పెడతారనే అనుమానంతో పోలీస్‌ పెట్రోలింగ్‌ను ఏర్పాటుచేశాం. అమరావతి మునిగిపోయిందంటూ వైకాపా, నీలిమీడియా పనిగట్టుకొని విష ప్రచారం చేస్తోంది. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని ఎప్పుడూ చూడలేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత వైకాపా హయాంలో బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చకపోవటం వల్లే భారీ వర్షాలకు కట్టలు తెగి అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసిందని తెలిపారు. ‘గుడ్లవల్లేరు కళాశాల విషయంలోనూ ఇదే తరహా రాజకీయాలా? 300 వీడియోలు ఉన్నాయా? ఎవరు చెప్పారు మీకు? దీనిపై దేశమంతా ప్రచారం చేస్తారా? ఆడబిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నారు. ఆ పార్టీలో ఆడబిడ్డల పట్ల ఎలా ప్రవర్తించే నేతలున్నారో చూస్తున్నాం. గుడ్లవల్లేరు విషయంలో ఫోరెన్సిక్‌ నిపుణులను రప్పించి కేసు విచారణ కొనసాగిస్తాం. తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవారైనా వదిలిపెట్టం’ అని చంద్రబాబు హెచ్చరించారు.చివరి ప్రాంతాలకు సాయం అందించలేకపోవటం బాధగా ఉంది
రెండు రోజులుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ముంపు ప్రాంతాల చివరన ఉన్న వారికి ఆహార పొట్లాలను అందించలేకపోవటం చాలా బాధాకరంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంపిణీ చేస్తున్న ఆహార పొట్లాలన్నీ ప్రారంభంలో ఉన్న ముంపు బాధితులు తీసుకుంటుండటంతో అవి చివరి వరకూ చేరవేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. వరద సహాయక చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించాక అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ‘నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఏడాది వయసున్న బాబును పట్టుకుని బయటకొచ్చారు.. సార్‌.. ఈ బాబు ప్రాణాల్ని కాపాడుకోవటానికి ఇంట్లో నా భార్యను వదిలేసి బయటకొచ్చా. ఫలానా చోట నా భార్య ఉన్నారు. ఆమె ప్రాణాలు మీరే కాపాడాలంటూ వేడుకోవటం ఎంతో బాధ కలిగించింది. ఓ వృద్ధ దంపతులు వరద నీటిలో తడిసిపోయి నిస్సహాయ స్థితిలో ఉండటం కలిచివేసింది..’ అని చంద్రబాబు అన్నారు. సింగ్‌నగర్‌ ప్రాంతంలో వరద తగ్గుముఖం పడుతోందని, ఇప్పటికే అడుగున్నర తగ్గిందని వెల్లడించారు. ‘ఈ కష్టకాలంలో అధికార యంత్రాంగం సేవల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించొద్దు. రాబోయే మూడు రోజులు యంత్రాంగమంతా సమర్థంగా పనిచేయాలి. బాధితులు భావోద్వేగానికి గురైనా సముదాయించి ఆదుకోవాలి. వరద తగ్గాక పారిశుద్ధ్యం మెరుగుపరిచి పునరావాసం కల్పించాలి. బాధితులందర్నీ ఆదుకున్నాకే ఇక్కడినుంచి కదులుతా’ అని పేర్కొన్నారు. 32 డివిజన్లకు ఇన్‌ఛార్జులుగా సీనియర్‌ ఐఏఎస్‌లు ‘వరద ప్రభావిత 32 డివిజన్‌లకు ఇన్‌ఛార్జులుగా 32 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించాం. మొత్తం 179 వార్డు, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ముంపు ఉంది. ప్రతి ఒక్క సచివాలయానికి ఒక గ్రూపు-2 స్థాయి అధికారికి బాధ్యతలిచ్చాం. ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు బోట్లు, ట్రాక్టర్లు వంటివి వారికి అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్క బోటులో ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లను ఉంచుతున్నాం. ఆహారపొట్లాలు అందజేసేందుకు ఆరు హెలికాప్టర్లను సిద్ధం చేశాం. 7-8 డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా 10 వేల మందికి ఆహార పొట్లాలు అందించగలిగాం. మంగళవారం నాటికి 30-35 డ్రోన్లను అందుబాటులోకి తెస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you