తెలంగాణవీణ ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలల్లో పర్యవేక్షణ పట్ల యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమానవీయ ఘటన విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.‘‘ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసింది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే.. వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం. కాసుల కక్కుర్తి తప్ప.. భద్రతా ప్రమాణాలను యాజమాన్యాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ.దీనిపై సాధారణ విచారణ కాదు.. ఫాస్ట్రాక్ విచారణ జరగాలి. తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ వేయాలి. సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలి. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టిందెవరో వెంటనే తేల్చాలి. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరోసారి ఇలాంటివి చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలి. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా బయటకు రాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వారంలోపు బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే కళాశాలకు వెళ్తా. విద్యార్థినులు కోరుకున్న న్యాయం జరిగే వరకు వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని షర్మిల పేర్కొన్నారు.