తెలంగాణవీణ ఏపీ బ్యూరో :కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే ఆరోపణల అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు తెదేపా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది.గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల ఘటనపై విచారణ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్‌రావు కళాశాల వసతిగృహానికి వెళ్లారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈక్రమంలో విద్యార్థులు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు కలెక్టర్, ఎస్పీ కార్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు.అసలేం జరిగిందంటే…కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. కళాశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థుల యత్నించారు. విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్‌కు చేరుకున్నారు. పోలీసులను విద్యార్థులను అదుపు చేశారు. అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ని ప్రశ్నించారు. అతడి ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో విజయ్‌కు మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.