తెలంగాణవీణ హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసింది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు.హైడ్రాకు మంత్రి నుంచి ఆదేశాలుఅక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 21వ తేదీన మంత్రి లేఖ రాశారు. దీంతో విచారణ జరిపిన హైడ్రా ఇవాళ కూల్చివేతను ప్రారంభించింది. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు కాగా.. 2014లో 2.39 ఎకరాల్లో 19 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. ఎఫ్టీఎల్ పరిధిలో 2020లో 4.69 ఎకరాల్లో 32 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు పేర్కొంది. తుమ్మిడి కుంట బఫర్ జోన్ మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు అని హైడ్రా పేర్కొంది. తుమ్మిడి చెరువులోని ప్రైవేటు వ్యక్తుల షెడ్లను కూల్చేస్తోంది. కొందరు అక్రమంగా బోరుబావులను తవ్వారు. వాటి ద్వారా నీటిని బయటకు సరఫరా చేస్తున్నారు.