తెలంగాణవీణ జాతీయం : దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రామ్‌లో స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం పై ఇన్నేళ్ల తర్వాత రాహుల్ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇంటర్వ్యూతో తన జీవితం మారిపోయిందని, ఆ వివాదం ఎంతగానో భయపెట్టిందని తెలిపాడు.ప్రముఖ పారిశ్రామికవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో కేఎల్ రాహుల్ ( పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 2019 నాటి వివాదంపై స్పందించాడు. ‘‘సాధారణంగా ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోను. కానీ, కొన్నేళ్ల క్రితం నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. కూర్చున్నా.. నిల్చున్నా ట్రోల్స్ చేశారు. ఆ ఇంటర్వ్యూ (కాఫీ విత్ కరణ్ షో) వ్యక్తిగతంగా నా జీవితాన్ని చాలా మార్చేసింది. సాధారణంగా నేను మృదుస్వభావం కలిగిన వ్యక్తిని. టీమ్‌ఇండియాకు ఆడటం మొదలుపెట్టిన తర్వాతే ఆత్మవిశ్వాసం పెరిగింది. 100 మంది మధ్యలో ఉన్నా మాట్లాడగలిగేవాణ్ని. కానీ, ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. ఆ ఇంటర్వ్యూ బాగా భయపెట్టింది. స్కూల్లో నన్నెప్పుడూ సస్పెండ్ చేయలేదు.. శిక్షించలేదు. ఆ వ్యాఖ్యల తర్వాత జట్టులో సస్పెన్షన్‌కు గురయ్యా. తొలిసారి అలాంటి అనుభవం ఎదురవడంతో దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. ఇప్పటికీ అది మాయని మచ్చలా మిగిలిపోయింది’’ అని రాహుల్ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నాడు.బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షో ఆరో సీజన్‌లో భాగంగా 2019 జనవరిలో పాండ్య, రాహుల్ పాల్గొన్నారు. ఆ షోలో మహిళలను ఉద్దేశించి వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై వారు క్షమాపణలు చెప్పినప్పటికీ బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రూ.20లక్షల చొప్పున జరిమానాతో పాటు కొంతకాలం సస్పెన్షన్ విధించింది. ఈ పరిణామాలతో ఆ ఎపిసోడ్‌ను డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించారు.