తెలంగాణవీణ జాతీయం :1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఇటలీ స్ప్రింటర్ పీట్రో మెనియా 200మీ. పరుగులో పసిడి గెలిచాడు. అది చూసి అప్పుడు 7 ఏళ్ల వయసున్న కుర్రాడు వాలెంటినా పెట్రిలో అథ్లెటిక్స్‌పై ఇష్టం పెరిగింది. ఒలింపిక్స్‌లో పోటీ పడి.. పీట్రోలా పసిడి గెలవాలన్న లక్ష్యం ఏర్పడింది. అయితే ఓ అబ్బాయిలా కాకుండా అమ్మాయిలా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలన్నది కోరిక. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేర్చుకునే అవకాశం లభించింది. కానీ ఒలింపిక్స్‌లో కాదు.. పారాలింపిక్స్‌లో! 2020లో లింగమార్పిడి చేసుకుని మహిళగా మారిన వాలెంటినా పారాలింపిక్స్ మహిళల విభాగంలో పరుగు పోటీలో బరిలో నిలిచింది. పారాలింపిక్స్‌లో పోటీపడబోతున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె ఘనత సాధించనుంది. 14 ఏళ్ల వయసులో కంటి సంబంధిత జబ్బుతో వాలెంటీనాకు దృష్టి లోపం ఏర్పడింది. పారిస్‌లో బుధవారం ఆరంభం కాబోతున్న ఈ పారాలింపిక్స్‌లో ఆమె టీ12 విభాగంలో 200మీ, 400మీ.పరుగులో పోటీపడబోతుంది. అది కూడా 50 ఏళ్ల వయసులో బరిలో దిగబోతుండటం విశేషం. యుక్త వయస్సు తర్వాత ట్రాన్స్‌జెండర్ అమ్మాయిగా మారిన వాళ్లను అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా ప్రపంచ అథ్లెటిక్స్ గతేడాది నిషేధించింది. కానీ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఈ నిర్ణయాన్ని సమర్థించలేదు. దీంతో పారాలింపిక్స్‌లో వాలెంటినా పోటీపడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ రేసులో వాలెంటినాకు అధిక ప్రయోజనం కలిగే ఆస్కారముందని ఆమెతో తలపడే స్ప్రింటర్లు వాపోతున్నారు.