తెలంగాణవీణ జాతీయం :ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు.ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు. కీవ్ పర్యటనలో ఉన్న మోదీతో అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యక్తిగతంగా, బృంద స్థాయిలో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.ఈ సంక్షోభం చిన్నారులకు వినాశకరం: మోదీ‘‘అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించాం. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైంది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’’ అని నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.గాంధీ విగ్రహానికి నివాళికీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.రెండు రోజుల పోలండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ.. 10 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు. అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వేస్టేషన్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.