తెలంగాణవీణ హైదరాబాద్ : తమ సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదన్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌తో పాటు పలువురు భారాస నాయకులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. గురువారం తిరుమలగిరిలో భారాస ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని డీజీపీకి చెప్పారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నేతలు చారాణా కూడా రుణమాఫీ కూడా చేయలేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. భవిష్యత్‌లో చర్యకు ప్రతిచర్య ఉంటుంది’’ అని కేటీఆర్ అన్నారు.