తెలంగాణవీణ జాతీయం : ప్రముఖ ఐటీ సేవల సంస్థ తాజా ఉత్తీర్ణుల ( నియామకాల కోసం వినూత్న ప్రోగ్రామ్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ‘పవర్’పేరిట దీన్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్ల కోసం దీన్ని రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికింద ఎంపికైన వారికి రూ.9 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఉంటుందని వెల్లడించారు.సాధారణంగా ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు రూ.3-3.5 లక్షల వార్షిక వేతనం ఇస్తుంటుంది. అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రతిభ గలవారిని ఆకర్షించటం కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది. కోడింగ్, సాఫ్ట్‌వేర్‌లో సవాళ్లు, ప్రోగ్రామింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి పవర్ ప్రోగ్రామ్‌లో ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఆయా రంగాల్లో వారి నైపుణ్యాన్ని పరీక్షించిన తర్వాతే ఎంపిక చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆమేరకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయన్నాయి. రూ.4-6.5 లక్షల నుంచి ప్రారంభమై రూ.9 లక్షల వరకు ఆఫర్ చేస్తామని తెలిపాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గత ఏడాది ‘ప్రైమ్’ పేరిట ఇదేతరహా నియామక ప్రక్రియను తీసుకొచ్చింది. దీనికింద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రొఫైల్స్‌లో ఎంపికైన వారికి ఏటా రూ.9-11 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది దీన్ని మరింత విస్తరిస్తూ కృత్రిమ మేధ, జనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్నవారికీ ఇదే ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో టీసీఎస్ ఇప్పుడు నింజా, డిజిటల్, ప్రైమ్ పేరిట మూడు కేటగిరీల కింద ఫ్రెషర్లను నియమించుకుంటోంది. వీటిలో వార్షిక వేతన ప్యాకేజీలు వరుసగా రూ.3.6 లక్షలు, రూ.7.5 లక్షలు, రూ.9-11 లక్షలుగా ఉన్నాయి.వరుసగా 6 త్రైమాసికాల పాటు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రం, ఇతర ఐటీ కంపెనీల తరహాలోనే తాజా ఉత్తీర్ణులను అధికంగానే నియమించుకుంటామని త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా గత నెల తెలిపింది. 2024-25లో 15,000-20,000 మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు ఇస్తామని, ఇందుకోసం ప్రాంగణ, ప్రాంగణేతర (ఆఫ్ క్యాంపస్) ఎంపికలు నిర్వహిస్తామని సీఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. టీసీఎస్ సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేందుకు ప్రణాళికలు ప్రకటించింది.క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారికోసం ఐటీ కంపెనీలు ప్రత్యేక నియామక ప్రక్రియలు చేపడుతున్నాయి. ఈ అధునాతన సాంకేతికతలకు భారీ గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఐటీ సేవల ఎగుమతులకు గిరాకీ తగ్గడంతో చాలా కంపెనీలు గత రెండేళ్లుగా ఉద్యోగులను పెద్దఎత్తున తొలగించాయి. గత ఆర్థిక సంవత్సరం భారత్‌లో వివిధ కంపెనీలు 70వేల మందికి ఉద్వాసన పలికాయి.