తెలంగాణవీణ సినిమా :భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అవార్డుకు ఎంపికైన వారిని ప్రముఖులు అభినందిస్తున్నారు. ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి, నటిగా పురస్కారం పొందిన నిత్యా మేనన్‌లకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు.‘జాతీయ అవార్డు విజేతలందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు రిషబ్ శెట్టి రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ బ్రదర్’ అని కామెంట్ చేశారు. 2021కు గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.నా బాధ్యత పెరిగింది: రిషబ్ శెట్టి ‘కాంతార’కు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుపొందడంపై రిషబ్‌శెట్టి ఆనందం వ్యక్తంచేశారు. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ‘నా ప్రయాణంలో భాగమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా హోంబలే ఫిల్మ్స్‌కు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూపించిన ఆదరణ మర్చిపోలేను. దీనివల్ల నా బాధ్యత పెరిగింది. ఇంకా మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి కష్టపడి పనిచేస్తాను. అత్యంత గౌరవంతో ఈ అవార్డును కన్నడ ప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను’ అని అన్నారు. ఇక జాతీయ అవార్డు గెలుపొందిన వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అగ్ర కథానాయకులు వీరిని అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టారు. చిరంజీవి, మోహన్‌లాల్, నానితో పాటు ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.