తెలంగాణవీణ జాతీయం :మహారాష్ట్ర ఎన్నికల వేళ శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అఘాడీ తరఫున కాంగ్రెస్, ఎన్సీపీ ఎవరిని సీఎం అభ్యర్థిగా నిలబెట్టినా తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు మహారాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. ఈమేరకు మహావికాస్ అఘాడీ కార్యకర్తల సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు.‘‘ఎంవీఏ తరఫున ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా నేను మద్దతిస్తా. ఈ పోరాటం నాకోసం కాదు. మహారాష్ట్ర ఆత్మగౌరవం కోసం’’ అని ఉద్ధవ్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారనే దానికన్నా ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ముఖ్యమని పేర్కొన్నారు. కూటమి తరఫున కార్యకర్తలంతా ఎన్నికల్లో ఉద్యమకారుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు.స్వాతంత్ర్య దినోత్సవం వేళ సెక్యులర్ సివిల్ కోడ్ కోసం ప్రధాని మోదీ పిలుపునివ్వడంపైనా ఉద్ధవ్ స్పందించారు. హిందుత్వను ఆయన వదిలేశారా? అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. భాజపాకు సొంతంగా మెజారిటీ ఉంటే వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో ఎందుకు పాస్ చేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. మహారాష్ట్ర సహా ఝార్ఖండ్, హరియాణా, జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఈ సాయంత్రం ఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.