తెలంగాణవీణ జాతీయం : ఒక్కగానొక్క కుమారుడిని చదివించి ప్రయోజకుడిని చేయాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. ఖర్చుకు వెనకాడకుండా డిగ్రీ చదవడానికి బెంగళూరుకు పంపారు. అడిగినంత డబ్బు ఇచ్చేవారు. ఆ డబ్బుతో కుమారుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. జూదం వ్యసనంగా మారడంతో రూ.కోట్లలో అప్పులు చేశాడు. కుటుంబ పరువు పోతుందని ఆస్తి మొత్తం అమ్మినా అప్పులు పూర్తిగా తీరకపోగా.. రుణదాతల ఒత్తిళ్లు అధికం కావడంతో తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ తెలిపిన వివరాల మేరకు.. అబ్దుల్లాపురానికి చెందిన ఉదారు మహేశ్వరరెడ్డి (45), ప్రశాంతి (39) దంపతులకు నిఖిల్‌రెడ్డి ఒక్కగానొక్క కుమారుడు. బెంగళూరులో అతడు ఆన్‌లైన్ బెట్టింగుల్లో భారీగా డబ్బులు కోల్పోయి రూ.2.40 కోట్ల మేర అప్పులు చేసినట్లు సమాచారం. వాటిని తీర్చేందుకు మహేశ్వరరెడ్డి దంపతులు అబ్దుల్లాపురంలోని పదెకరాల భూమి, ఇల్లు, వ్యవసాయ కల్లం అన్నీ విక్రయించారు. అయినా అప్పులు తీరలేదు. మిగిలిన అప్పు తీర్చాలని రుణదాతలు ఒత్తిడి తేవడంతో మామ వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన మూడెకరాల భూమినీ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కొనేవాళ్లు దాన్ని మరీ తక్కువకు అడగడం వారిని కలచివేసింది. దీంతో మహేశ్వరరెడ్డి దంపతులు మంగళవారం అర్ధరాత్రి అబ్దుల్లాపురం సమీపంలోని పొలానికి వెళ్లి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున అటువైపు వెళ్లిన రైతులు వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.